31 Jan 2020

నిన్ను.. నిన్ను...

నిన్ను కలసా వయసులో
నిన్ను చూసా సొగసులో
నిన్ను నిలిపా మనసులో
నిన్ను మరువనని తెలుసుకో 

మించిపోయిన తరుణం

అలలా వచ్చి వెళ్లి
కలలా మారినావు
ఇలలో నన్నొదలి నీవు
మరలా రానేలేదు..

తిమ్మెరలా తట్టి తట్టి
తెరలే తీయబోకు
తరలి వెడలి నేను
మరలా నిన్ను చేరలేను..

9 Feb 2019

చేరరావే ప్రియా!

హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసి
ప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి 
ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -

మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా 
మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,

మేఘాల అప్పగింతల నుండి వెలువడి
చినుకెపుడు తన దోసిట చేరుతుందా అని 
తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -

ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?
ఇదే శాశ్వతమై పోతే విరహం కాస్తా విరాగమై పోదూ?
ప్రేమకు కథలు ఉంటే బాగుంటుంది కాని వ్యథలు ఉంటే ఏం బాగుంటుంది చెప్పు?

8 Feb 2019

నువ్వు-నేను-ఈ ప్రపంచం


ప్రియా!

ఈ ప్రపంచాన్ని నే మరచానంటే
నా ప్రపంచంలోకి నువ్వొచ్చినట్టు

నా ప్రపంచంలోకి నువ్వొచ్చావంటే
నన్ను నేను మరచినట్టు 

23 Oct 2015

అందమైన క్షణాలు


చిరుజల్లుతో ఒక రవికిరణం హరివిల్లైన క్షణాన 
అప్రయత్నపు పైకి చూసిన నీ చూపులలో, అతివేగపు కదలికల నీ కనురెప్పపై 
జాలువారిన వర్షపు చినుకుకు, కలసి పొంచిన అందానికి
నా హృదయం స్పందించకపోయి ఉంటే, నాదీ ఒక హృదయం అయ్యిండేది కాదు!

16 Dec 2010

ప్రేమంటే...

ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -
"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.

మన ప్రాణాలన్నీ...

నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నీ పంచ ప్రాణాలూ  నా ఒక్క ప్రాణమని అంటున్నానేకాని 
నీ ఒక్క ప్రాణం కోసం నా పంచ ప్రాణాలు పణంగా పెట్టనా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...

15 Dec 2010

ఇవ్వడమే కదా ప్రేమ

బంధం ఆకర్షణతో మొదలైనపుడు
ఆకర్షణ ఆశించడాన్ని నేర్పింది
ఆకర్షణ ప్రేమగా మారినపుడు
ప్రేమ ఇవ్వడాన్ని నేర్పింది.
ఎంతగా అంటే ఎంత ఇచ్చినా
ఇంకా ఏదో లోటు చేస్తున్నాననే...

మన మనసుకున్న మనుషులు

ప్రతి మనసుకి కన్నీరు ఉంటుంది
ఆనందంతో, దుఃఖంతో.
అవి మనసులో ప్రవేశించే మరో ప్రతి మనసుకి
ఒక అర్హత పత్రాన్నిస్తాయి!

ఏ ఒక్క మనిషి వలన మనకు
ఈ రెండు కన్నీళ్లు ఉంటాయో
వాళ్ళే మన మనుషులు,
మన మనసుకున్న మనుషులు.