Showing posts with label విరాగం. Show all posts
Showing posts with label విరాగం. Show all posts

9 Feb 2019

చేరరావే ప్రియా!

హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసి
ప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి 
ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -

మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా 
మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,

మేఘాల అప్పగింతల నుండి వెలువడి
చినుకెపుడు తన దోసిట చేరుతుందా అని 
తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -

ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?
ఇదే శాశ్వతమై పోతే విరహం కాస్తా విరాగమై పోదూ?
ప్రేమకు కథలు ఉంటే బాగుంటుంది కాని వ్యథలు ఉంటే ఏం బాగుంటుంది చెప్పు?

4 Dec 2010

నిర్దయ

ఆయుష్షుందని,
శరీరం శిధిలమైనా ప్రాణాన్ని బంధించి ఉంచే
ఆ దేవుని నిర్దయలాంటిదే
ప్రేమ చచ్చిపోయిన హృదయమున్న మనిషిని
జీవింపచేయడం కూడా!

ప్రియురాలిని పారేసుకుంటే...

నాకిష్టమైన ఆణిముత్యాన్ని
అదృష్టం లేక పోగొట్టుకున్నాను
మీకు దొరికిందా, మీకు దొరికిందాని
నోరు తెరిచి, చేతులు చాచి అడగలేక
దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నాను
అది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరి
ఆనందాలను పంచుతూ ఉంటుంది,
ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది?
పారేసుకున్న చోటు తెలుసు,
తెలిసినా వెదకలేను,
వెదికినా వేడుకలను చూడలేను...
తిరిగి నా ముత్యాన్ని ముత్యపు చిప్పలో
ఉంచి తెచ్చిఇచ్చినా,
అది నా ఆణిముత్యమవుతుందా?
ప్రేమ...
ఒకచోట కొందర్ని ఆనందసాగారాలలో తెలుస్తోంది అంటే,
ఎక్కడో ఒకచోట మరి ఇంకవరినో దు:ఖసముద్రంలో ముంచిందన్నమాటే!
కనీసం కొందరి విషయంలో...

28 Nov 2010

జాతర రాత్రులు

నేననుభవిస్తున్న శిక్షో,
విధి నా మీద సాధిస్తున్న కక్షో,
లేక నేనేదుర్కుంటున్న పరీక్షో తెలియదు కాని
జాగు లేని జాములో
విశ్రమించడానికి శ్రమించడం...

అసలు జరిగేదొకటే నేస్తమా...
నిట్టూరుస్తూ వాలిపోయే నాలో
మన జ్ఞాపకాలు వరసగా రీళ్లై
కనుమూసిన రెప్పల తెరలపై
ప్రదర్శించబడే చలన చిత్రాలౌతాయి

ఈలోగా
దూరంగా ఎక్కడో ఒక కుక్క అరుపు వినబడుతుంది
ఈలోగా ఒక గాలి తిమ్మెర చల్లగా ఓదార్చి పోతుంది
ఆఖరికి మాగన్నుగా ఒక కునుకు పట్టేవేళ
కోడి కొక్కొరొకో అంటుంది.
సత్యం, ఇది నిత్యం.

దూరమైనందుకు అదృష్టం

నీ రూపం ఒక అపురూపమై
మన మధ్య ఆగిపోయిన కాలంతో పాటు
ఒక అందమై, అద్భుతమై  
నా మదిలో నిలిచిపోయింది.
నిలిచిపోతుంది... ఎన్నటికీ మారనట్టు,
ముడతలు పడనట్టు...
అదృష్టమే కదా మరి!

25 Nov 2010

తలపుల తలుపులు

తపనల తలపులు తరమగ
వలపుల తలుపులు తెరవకు

మరచిన మనుషులు మెదలగ
గడిచిన కధలను వెదుకకు.

3 Nov 2010

ఘటన-వరం

జీవితాంతపు కలయిక కోసం...

ఘటన లేదని తెలిసీ
వరమొకటి ఉంటుందని
దేవుని ముందు మోకరిల్లిందొక ప్రార్ధన...

ఘటన లేకుంటే
వరమనే ప్రసక్తే లేదని
కొట్టివేయబడింది చేసుకున్న అభ్యర్ధన!

14 Mar 2010

నెచ్చెలికై...

మంచుబిందువొకటి నను చేరవచ్చేవేళ
గడ్డిపరకనైనను నేను జామంత మోస్తాను - పరవశాలు పోతాను.
రవికిరణంబొకటి ఉదయించువేళ
ఆవిరయ్యే నెచ్చెలికై కనులు ధారలు కడతాను - అలజడులు పోతాను.

23 Dec 2009

నీ చలనచిత్రాల జ్ఞాపకాలు...

... పగిలిపోయిన హృదిలో
నీవొదలిపోయిన జ్ఞాపకాలు,
... రగిలిపోయిన మదిలో
నిలిచిపోయిన నీ చలనచిత్రాలు

కలసి... వెరసి...

వెర్రెక్కిస్తున్నాయంటే నమ్మగలవా...
ప్రియా!
వెక్కిరిస్తుంటే మాత్రం నువ్వు చూడగలవా?

ఆమె చూస్తే కనుక...

ఆమె చూస్తే కనుక, ఆమె వెనుకే పడక
ఆమె వెంటే నడక, నడక మించిన పరుగు...
వగర్చి వగర్చి...

... పరుగులెడితే నీవు జారిపడతావు,
తెరిచిఉంచేవూ హృదయం పగిలిపొయ్యేను,
నలిగిపోయిన పయనం బరువు తోచేను,
ప్రాణముంటేనా బ్రతుకు? కాష్టమల్లే నడచు...

10 Nov 2007

అభిషిక్తం

ఆ ఆకాశంలో వెన్నెల వెలిగిస్తే వెలిగే దీపం కాదు
ఈ హృదయంలో ప్రేయసి చెరిపేస్తే చెరిగే రూపమూ కాదు -
నువ్వు, నేను, మన మధ్య ఈ ప్రేమ
ఇవన్నీ తొలగిపోయేది
చెరిగిపోయేది
మట్టితో మనమభిషిక్తులమయ్యాకనే
అంత వరకూ ప్రేయసీ!
నువ్వెవరైవైనా
నువ్వెక్కడున్నా
ఈ రెండు హృదయాలూ
ఒకానొక శూన్యంలో
ప్రేమ అనే వారధితో బంధింపబడి
వేదనతో కూడిన తృప్తిని
మైమరచిపోయి అనుభవిస్తూనే ఉంటాయి.

పోయిన ప్రాణాలు...

ప్రభూ!

నేను మరణించిపోతాను అని నాకు ముందే తెలిస్తే
నేను ఫక్కున నవ్విపోతాను - ఎందుకంటే -
నేను ఒక దేవత ప్రేమకు దూరమైన రోజున
మరణించిపోయాక కూడా
కొత్తగా మీరొచ్చి తీసుకుపోయే ఈ ప్రాణాన్ని చూసి
నేను ఫక్కున నవ్వుతాను.

గెలుపు రాని ఓటమి

ప్రపంచంలో మరే విషయంలో అయినా కాని
ఓటమి తర్వాత గెలుపు రావచ్చు
కాని ప్రియా!
నిన్ను నిన్నుగా నేను కోల్పోయాక కూడా
ఓటమి తరువాత మరెన్నటికీ గెలుపు రాదు,
అయినా అది ముగింపు అనడానికి మనసూ రాదు...

4 Nov 2007

ఆత్మ లేని ప్రార్ధన

ఓ ప్రభూ

నిన్ను చేరడానికి

నాకుకొన్ని పూలంటూ ఉండాలి - నిన్ను అర్చించడానికి,
కొన్ని పాలంటూ ఉండాలి - నిన్ను అభిషేకించడానికి,
కొన్ని పళ్ళంటూ ఉండాలి - నీకు నివేదించడానికి...

కాని ప్రభూ

వీటన్నిటికీ మించి నాకొక మనసంటూ ఉండాలి -
అది నేను తిరిగి పొందడానికి మరొ జన్మంటూ ఉండాలి.

హృదయబాధ

ప్రియా!

నీకెటుల  తెలుపగలనే మన ప్రేమ గాధను మోసే నా హృదయబాధను

పరధ్యానం

... నీవు లేని నాకేది ధ్యానం
మిగిలింది నాకిక పరధ్యానం ...

3 Nov 2007

ప్రార్ధన-ప్రారబ్దం

ప్రియా!
ఒక ప్రార్ధన నుండి జనించని ఒక వరం
ఒక ప్రారబ్దం నుండి మరణించని ఒక శాపం
కలసి ఇపుడు మన మద్య సృష్టించినదే ఈ దూరం.

మనసుకు ఎవరూ లేరు

ప్రియా నీవెళ్ళిపోయాక కూడా
నాకు చాలామంది ఉన్నారు
కాని...
నామనసుకే ఎవరూ లేరు..  పాపం... 

మనలోని...

మనలోని వెచ్చదనం
మనలోని స్వచ్చదనం
తిరిగి ఏపుణ్యాలు చేస్తే
తిరిగొస్తాయి ప్రియతమా?