Showing posts with label విరహం. Show all posts
Showing posts with label విరహం. Show all posts

9 Feb 2019

చేరరావే ప్రియా!

హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసి
ప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి 
ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -

మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా 
మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,

మేఘాల అప్పగింతల నుండి వెలువడి
చినుకెపుడు తన దోసిట చేరుతుందా అని 
తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -

ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?
ఇదే శాశ్వతమై పోతే విరహం కాస్తా విరాగమై పోదూ?
ప్రేమకు కథలు ఉంటే బాగుంటుంది కాని వ్యథలు ఉంటే ఏం బాగుంటుంది చెప్పు?

8 Feb 2019

నువ్వు-నేను-ఈ ప్రపంచం


ప్రియా!

ఈ ప్రపంచాన్ని నే మరచానంటే
నా ప్రపంచంలోకి నువ్వొచ్చినట్టు

నా ప్రపంచంలోకి నువ్వొచ్చావంటే
నన్ను నేను మరచినట్టు 

23 Oct 2015

అందమైన క్షణాలు


చిరుజల్లుతో ఒక రవికిరణం హరివిల్లైన క్షణాన 
అప్రయత్నపు పైకి చూసిన నీ చూపులలో, అతివేగపు కదలికల నీ కనురెప్పపై 
జాలువారిన వర్షపు చినుకుకు, కలసి పొంచిన అందానికి
నా హృదయం స్పందించకపోయి ఉంటే, నాదీ ఒక హృదయం అయ్యిండేది కాదు!

4 Dec 2010

నీ జ్ఞాపకాల సవ్వడి

కదలక కదలాలనిపించక
వలదని అన్నా,
వదలక మనసున చొరబడి,
ఏదో సడి... యదలో అలజడి...

18 Nov 2010

తూనీగ

మురిపిస్తేనే... మరపిస్తేనే
ఆనక యదపై వాలి
రొదనే మరిచి
మధువును గ్రోలింది ఆ అతిధి!

తననే వలచి అన్ని మరచి తృప్తిని గెలిచి నింగి కెగిరింది ఆ పరువం
మరలవచ్చేటి మధు పంపకానికై ఎదురుచూస్తోంది విరి విరహం...

13 Dec 2009

నా లోకం నుండి లోకానికి...


ప్రియా !

..........................నీవు లేని చోట నేనున్నా
......................... నీ చెంత నేలేకున్నా...
దరి చేరని దారుల మాటున
మాటే మౌనం... మనసే ధ్యానం...

......................... జపించు మనసున పుట్టిన
......................... జనించు ఊహల సృష్టి...

ఈ కవనం... ఈ కధనం...

7 Dec 2009

గతమైన వర్తమానం

మేడమెట్లపై

శీతాకాలపు సాయంత్రపు నీరెండకు ఎదురుగా కూర్చుంటే
గతమంతా వర్తమానమైనా, వర్తమానం మాత్రం గతంలో నిలిచినట్లు...

చేతిలో కాఫీ కప్పు, మనసులో నీ ఆలోచనలు
వెరసి మనసొక వేదికైతే జరిగేదంతా వేడుకే మరి...

నేను - నువ్వు - నీ అల్లరి - నును వెచ్చని నీ చేతుల్లో నా మోము
దరిచేర్చుకునే నీ అధరాలు... సిగ్గుల సాక్ష్యులకాధారాలు...

వద్దని అంటానే కాని పొమ్మని విదిలించని నా మనసు, కావాలనిపించే వయసు...
ఆ తరువాతైనా ఆగని నీ పయనాలు, నన్నంతా వేదికేసే నీ నయనాలు...

నేనెంత ఒదిగినా, నీ ఒపికంతా ఊపిరులై ఎగిసేవేళ
నా అణువణువూ మనసునే నింపుకుంటాను, నీవిచ్చే అనుభవమంతా జ్ఞాపకమై నిలుపుకుంటాను...

చివరకి నా చేతులే నన్నుకౌగిలించుకునేవేళ
ఈ వర్తమానపు వేదికపైకి సిగ్గుతో తలదించుకొని తిరిగి వస్తాను

అయినా ఇవన్ని తిరిగి తిరిగి చేస్తాను
నువ్వు తిరిగొచ్చే వరకూ... మరల 'అది' చేసేవరకు...

26 Nov 2009

నువ్వులేని ప్రపంచం

నాకు కలిగే బాధ అదొక తియ్యనిది
నువ్వు దూరంగా ఉన్నావంటే
నీ ఆలోచన నాకు దగ్గరవుతుంది
నన్ను నేను కోల్పోతాను
నువ్వే నేనవుతాను
కన్నీళ్ళు వస్తాయి
చిర్నవ్వూ వస్తుంది
కాని ఇదేమీ ఎరుగని నన్ను 
చివరకి ఎవరో తట్టి పిలుస్తారు
ఉలిక్కిపడ్డాక
అప్పుడొక గాఢమైన నిట్టుర్పూ వస్తుంది...
చివరికదొక నిత్యమై నిలుస్తోంది...

4 Nov 2007

కాలం

ప్రియా!

చూడు 

నీవున్నపుడు దానిని గుర్తించలేదని కోపంతో పరుగులెట్టి
నీవులేనపుడు వెక్కిరిస్తో నెమ్మదిగా అడుగులో అడుగులేస్తోందీ కాలం

20 Oct 2007

విహంగవీక్షణం

నీవు నాకై చూసే చూపు అరక్షణం
నా మనసు తేలియాడె విహంగవీక్షణం

పరిచయం లేని ఎదురుచూపు

సాయమవుతున్నా సాయానికే రావు
రాత్రైతే నామనసు నైరాశ్యమై పోవు
ఐనా వచ్చేస్తున్నా అనే ఊసే పంపబోవు
ఇంతకూ పరిచయమే కాని ఎవరు నీవు?

15 Oct 2007

ప్రియా! మరచి పోవద్దు

ప్రియా!

ఆనాటి

వెన్నెల పొద్దు
కౌగిలి హద్దు
తియ్యటి ముద్దు
మరచి పోవద్దు.