Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

9 Feb 2019

చేరరావే ప్రియా!

హృదయం ముంగిట స్నేహమనే ముగ్గు వేసి
ప్రేమ అనే పేరంటానికి ఆర్తి అనే ఆహ్వానాన్ని పంపి 
ఎద సాక్షిగా ఎదురుచూపు చూస్తున్నా -

మబ్బుల మాటున మాట మాత్రంగా నైనా చెప్పకుండా 
మరుగున పడిన మసక వెన్నెలలా నువ్వు,

మేఘాల అప్పగింతల నుండి వెలువడి
చినుకెపుడు తన దోసిట చేరుతుందా అని 
తల పైకెత్తి చూసే ముత్యపు చిప్పలా నేను -

ఇలా ఇంకెంత కాలం ప్రియా ఈ విరహం?
ఇదే శాశ్వతమై పోతే విరహం కాస్తా విరాగమై పోదూ?
ప్రేమకు కథలు ఉంటే బాగుంటుంది కాని వ్యథలు ఉంటే ఏం బాగుంటుంది చెప్పు?

8 Feb 2019

నువ్వు-నేను-ఈ ప్రపంచం


ప్రియా!

ఈ ప్రపంచాన్ని నే మరచానంటే
నా ప్రపంచంలోకి నువ్వొచ్చినట్టు

నా ప్రపంచంలోకి నువ్వొచ్చావంటే
నన్ను నేను మరచినట్టు 

16 Dec 2010

ప్రేమంటే...

ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -
"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.

మన ప్రాణాలన్నీ...

నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నీ పంచ ప్రాణాలూ  నా ఒక్క ప్రాణమని అంటున్నానేకాని 
నీ ఒక్క ప్రాణం కోసం నా పంచ ప్రాణాలు పణంగా పెట్టనా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...

15 Dec 2010

ఇవ్వడమే కదా ప్రేమ

బంధం ఆకర్షణతో మొదలైనపుడు
ఆకర్షణ ఆశించడాన్ని నేర్పింది
ఆకర్షణ ప్రేమగా మారినపుడు
ప్రేమ ఇవ్వడాన్ని నేర్పింది.
ఎంతగా అంటే ఎంత ఇచ్చినా
ఇంకా ఏదో లోటు చేస్తున్నాననే...

27 Nov 2010

Can't but not leasT

పదే పదే నన్ను ప్రేమించమని ఆత్రంగా ఎలా అడగగలను?
నన్ను ప్రేమిస్తుంటే మాత్రం అన్నీ గెలవగలను, నీతో సహా...

18 Nov 2010

ఎవ్వారు ఉన్నారే?

అసలంటూ ఉన్న ఈ ప్రపంచంలో అందరూ ఉంటారు నేను తప్ప,
నాకంటూ ఉన్న నా ప్రపంచంలో ఎవ్వరూ లేరు నువ్వు తప్ప.

తూనీగ

వెదుకులాటతో మొదలయ్యే ఆత్రం...
ఈ వినువీధుల్లొ నా ప్రయాణం - ఝుమ్మనె నాదాన్నిస్తుంది.

వెదికింది దొరికితే మాత్రం...
నా కనుసన్నల్లో ఒక నేస్తం - తానే తేనెను ఇస్తుంది.

14 Mar 2010

నెచ్చెలికై...

మంచుబిందువొకటి నను చేరవచ్చేవేళ
గడ్డిపరకనైనను నేను జామంత మోస్తాను - పరవశాలు పోతాను.
రవికిరణంబొకటి ఉదయించువేళ
ఆవిరయ్యే నెచ్చెలికై కనులు ధారలు కడతాను - అలజడులు పోతాను.

25 Dec 2009

దూరం - దగ్గర

ప్రియా!


నిలువెత్తు సాక్ష్యంగా నువ్వు నా చెంత లేనపుడు
ఎంత దగ్గరలో ఉన్నా వేయి యోజనాల దూరమే,


నా మనసులో ఆసాంతం నీవు నిల్చినపుడు మాత్రం
ఎంత దూరంలో ఉన్నా కౌగిలిపాటు దగ్గరే...

23 Dec 2009

ప్రభూ...

... రాధను మాత్రం కాను,
ప్రేమారాధనను నేను,
బాధను మాత్రమే కాను,
యదార్ధగాధను నేను.

19 Dec 2009

కృతజ్ఞతలు...

... నేనే నీకు చెప్పాలి కన్నా కృతజ్ఞతలు
నీవన్నీనేను దోచుకున్నాను,
జ్ఞాపకాల పుస్తకంగా దాచుకున్నాను,
ఎపుడు కావాలంటే అపుడు చదువుకుంటాను...

6 Dec 2009

నీ రూపు

ఇంతకుమునుపు నేనెన్ని కాలాలు నీతో గడిపిఉందును గాక
ఆఖరిసారి నా కనులు చిత్రించిన నీ రూపమేనాకపురూపమై
నా మనో:ఫలకం నా ముందు ఉంచుతుంది
కనులు మూసినా కనులు తెరిచినా...
... తిరిగి మరల నిన్ను గాంచేవరకూ

నిస్తేజం

లోకమెపుడూ నిందిస్తుందని,
నగుబాట్లు, కట్టుబాట్లు వెల్లువెత్తుతాయని
పాపపుణ్యాలు, సంప్రదాయాలు అసలంటూ ఉన్నాయని,
బంధాలు, బాధ్యతలూ బంధిస్తున్నాయని,
ప్రియా!...
కాలరాయబడిన ఉద్యమంలా
నిజాయితీతో నిండినదైనా మన ప్రేమ
అన్నిటి వెనుక ఉండిపోయింది
అసలేంకాకుండా పోతోంది...
తీపి జ్ఞాపకాలను మోసుకొంటూ
చేదు వాస్తవాన్ని తలచుకుంటూ ...

27 Nov 2009

కొనసాగుతున్న కౌగిలిలో

...కొనసాగుతున్న కౌగిలిలో
తనవులు రెండు తపనే ఒకటి... ప్రేమే ధ్యానం...
తపనే ఒకటి తలపే ఒకటి... మాటే మౌనం...

నువ్వూ - నేనూ

నువ్వూ - నేనూ ఒక ప్రపంచం,
నువ్వూ - నేనూ ఒకటే ప్రపంచం,
నువ్వూ - నేనూ అదొక ప్రపంచం...

26 Nov 2009

ప్రియ హిమ శైలం...

నిదురరాని చోట ఒక అందమైన కలలా...
నీళ్లులేని చోట ఎగిరొచ్చే అలలా...

ఎదురొచ్చి ఆపై మనసిచ్చి
ప్రభువిచ్చిన వరమై నాలో సగమై
ఎదలో ఒదిగి ఆనక హిమమై ఎదిగి
నిన్నే అర్పించి నన్నంతా గెలిపించి
వ్యక్తమయ్యే నాలోఅవ్యక్తమయ్యే నువ్వు
నా జీవన గానం... ప్రియ హిమ శైలం...

10 Nov 2007

పదిలం

ప్రియా!

ప్రపంచంలో నేను చూసిన అందం
నీతోపాటూ కనుమరుగైపోయింది

అనుభవంలో నేను పొందిన ఆనందం మాత్రం
నీతోపాటూ నా హృదయంలో పదిలమై పోయింది.

నీ రూపం - ఒక ధ్యానం

నే కనుల మూయిటే ఒక పాపం
వచ్చి నిలుచునే నీరూపం

నా మనసులోనికి ఒక పయనం
నీ చెంత నిలుచుటే ఒక ధ్యానం.

నా నీడగా నువ్వు...

నీడలో మనిషి లేడనేది నిజం
మనిషి లేకుండా నీడ లేదనేది కూడా నిజం
కాని ప్రియా!
మనిషిగా నేను, నా నీడగా నిన్ను భావిస్తే
ప్రేమ ఉన్న వెన్నెల వెలుగులో
నేనున్న ప్రతీచోట నీవు నీడగా ఉన్నట్లే
కాని ఆ నీడలోనే నీవు లేవు.