28 Nov 2010

జాతర రాత్రులు

నేననుభవిస్తున్న శిక్షో,
విధి నా మీద సాధిస్తున్న కక్షో,
లేక నేనేదుర్కుంటున్న పరీక్షో తెలియదు కాని
జాగు లేని జాములో
విశ్రమించడానికి శ్రమించడం...

అసలు జరిగేదొకటే నేస్తమా...
నిట్టూరుస్తూ వాలిపోయే నాలో
మన జ్ఞాపకాలు వరసగా రీళ్లై
కనుమూసిన రెప్పల తెరలపై
ప్రదర్శించబడే చలన చిత్రాలౌతాయి

ఈలోగా
దూరంగా ఎక్కడో ఒక కుక్క అరుపు వినబడుతుంది
ఈలోగా ఒక గాలి తిమ్మెర చల్లగా ఓదార్చి పోతుంది
ఆఖరికి మాగన్నుగా ఒక కునుకు పట్టేవేళ
కోడి కొక్కొరొకో అంటుంది.
సత్యం, ఇది నిత్యం.

దూరమైనందుకు అదృష్టం

నీ రూపం ఒక అపురూపమై
మన మధ్య ఆగిపోయిన కాలంతో పాటు
ఒక అందమై, అద్భుతమై  
నా మదిలో నిలిచిపోయింది.
నిలిచిపోతుంది... ఎన్నటికీ మారనట్టు,
ముడతలు పడనట్టు...
అదృష్టమే కదా మరి!

27 Nov 2010

Can't but not leasT

పదే పదే నన్ను ప్రేమించమని ఆత్రంగా ఎలా అడగగలను?
నన్ను ప్రేమిస్తుంటే మాత్రం అన్నీ గెలవగలను, నీతో సహా...

కన్ఫర్మ్డ్

విషాదంలో ఉన్నాననుకుంటారంతా
నన్ను, ఈ ప్రపంచాన్ని కలగలిపి మర్చిపోయేంతగా
నీ తియ్యని జ్ఞాపకమొకటి మదిలోకొస్తుంది
కనులు శూన్యంలో నిలిచిపోతాయి
కాలం నన్ను దాటిపోతుంది
నవ్వు చెక్కిలి జారిపోతుంది...
చివరిగా ఈలోకంలోకి వస్తుంటే
కన్నీరు ఒలికిపోతుంది, విషాదంలో ఉన్నాననుకుంటారంతా!

25 Nov 2010

తలపుల తలుపులు

తపనల తలపులు తరమగ
వలపుల తలుపులు తెరవకు

మరచిన మనుషులు మెదలగ
గడిచిన కధలను వెదుకకు.

18 Nov 2010

తూనీగ

మురిపిస్తేనే... మరపిస్తేనే
ఆనక యదపై వాలి
రొదనే మరిచి
మధువును గ్రోలింది ఆ అతిధి!

తననే వలచి అన్ని మరచి తృప్తిని గెలిచి నింగి కెగిరింది ఆ పరువం
మరలవచ్చేటి మధు పంపకానికై ఎదురుచూస్తోంది విరి విరహం...

ఎవ్వారు ఉన్నారే?

అసలంటూ ఉన్న ఈ ప్రపంచంలో అందరూ ఉంటారు నేను తప్ప,
నాకంటూ ఉన్న నా ప్రపంచంలో ఎవ్వరూ లేరు నువ్వు తప్ప.

తూనీగ

వెదుకులాటతో మొదలయ్యే ఆత్రం...
ఈ వినువీధుల్లొ నా ప్రయాణం - ఝుమ్మనె నాదాన్నిస్తుంది.

వెదికింది దొరికితే మాత్రం...
నా కనుసన్నల్లో ఒక నేస్తం - తానే తేనెను ఇస్తుంది.

3 Nov 2010

ఘటన-వరం

జీవితాంతపు కలయిక కోసం...

ఘటన లేదని తెలిసీ
వరమొకటి ఉంటుందని
దేవుని ముందు మోకరిల్లిందొక ప్రార్ధన...

ఘటన లేకుంటే
వరమనే ప్రసక్తే లేదని
కొట్టివేయబడింది చేసుకున్న అభ్యర్ధన!