14 Dec 2007

నీకో ప్రేమలేఖ

నీ ఊరే,
28th April, 2k.

నేను క్షేమం.


ప్రియమైన బావకు,

నీ లక్ష్మి వ్రాయునది. నువ్వు క్షేమం అని తలుస్తాను. అవును క్షేమమేనా ? - గ్రీష్మాన్నే శిశిరంగా ఎంచి ఈ వసంతం కోసం... కేవలం ఈ వసంతం కోసమే కదూ నువ్వు ఉద్యోగం సంపాదించడం విషయంలో కష్టపడుతున్నది. నువ్వు లేక మన ఊరు నాకైతే మూగపోయిందా అనిపిస్తోంది. ముఖ్యంగా మా ఇంటి ముందున్న వీధి. రోజుకి ఒకసారైనా నేను కనబడకపోతే ఒక మనిషి కళ్ళు మా ఇంటి ముందు నుండి వెళ్తూ మా ఇంటి లోపలికంటూ వెదికేవి. ఆ మనిషి ఎవరో నీకు నాకు మాత్రమే తెలుసనుకుంటున్నాను.


నేను ఎగ్జామ్స్ బాగా రాయాలని కష్టపడి చదువుతున్నా, కాని నామనసు నా మాట వింటేనా? బెల్లం చుట్టూ ముసిరి ఉన్న ఈగల్ని ఎంత తరిమినా మళ్ళీ ఎలా వచ్చి వాల్తాయో అలా నీ తాలూకు మధురమైన ఆలోచనలు ఎంత వద్దని వారించినా క్షణాలలో ముప్పిరిగొనేవి. (పోలిక బావుందా?) వాటికేం తెలుసు నాకు పరీక్షలని, నాకు తెలుసుకాని.

బావా! (ఇలా పిలిస్తే భలే బావుంది కదా!) నీ మనసు నాకు తెలుసు, నేను లెటర్ రాయలని కోరుకుంటావని - నా లెటర్ కోసం ఎదురుచూస్తుంటావని. కాని నేను లెటర్ రాస్తే నువ్వు ఇంకా నా గురించే ఆలోచిస్తూ ఉంటావని నా భయం. నువ్వు అక్కకి రాసిన లెటర్ అక్క చూపించింది. అందులో నేను నీకు లెటర్ రాయలేదేమని నన్ను నువ్వు తిడతావని ఆశించాను. ఆ ఊసే లేదు. నువ్వు చెబితేనే లెటర్ రాయాలని కాదు, కాని నువ్వు నేను నీకు లెటర్ రాయాలని ఆశిస్తున్నావో లేదో నాకు తెలియదు. రాయాలని ఇంటిమేట్ చేసాక రాస్తే ఇక అందులో ఇక ప్రేమేముంది అని నువ్వు అనుకుంటూనే నేను అడగకుండా 'తను తనకి రాయాలనిపించి రాయలి' అని నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. కాని ప్రేమలో 'నేను నీకోసం అల్లాడిపోతున్నాను' అని తెలియచేయడానికి ఇగో(అహం) ఎపుడూ అడ్డురాకూడదు, అది స్త్రీ అయినా, పురుషుడైనా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పడుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ కి బీజం. నేను నీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను - 'ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల ఆలోచనలలో ఫ్రీక్వెన్సీ ఒకే విధంగా ట్యూన్ చేయబడి ఉండదు' అని, కొన్నిసార్లు మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది - సరిగ్గా అపుడు మాత్రమే దగ్గరవ్వడం జరుగుతోంది.


కేవలం మరో వ్యక్తి పట్ల, లేదా వ్యక్తిని ప్రేమిస్తుంటే - 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పి ఊరుకోకూడదని నా ఉద్దేశం. ప్రేమలో కలిగే విరహం, కోపం, కామం, 'నీవు నాకు ఇలా ఉంటే మరింత బాగుంటుంది' అనే భావం ఇవన్నీ ఆ మరో వ్యక్తి దగ్గర వ్యక్తీకరించాలి. అవి తీర్చుకోవాలి కూడా. కేవలం ఆ మనిషి దగ్గరైనా (అది ప్రియురాలి దగ్గరైనా) మనసులో కలిగే రకరకాలైన ఇంటెన్షన్స్ ని బయటపెట్టుకోలేక ఇగోని అడ్డుపెట్టుకుంటే ఇక ప్రేమ ఎందుకు? ప్రేమించడం ఎందుకు?

If you love some one express it అనే దానిలో If you have some feeling express it అనే దానిలో అనేది అంతర్భాగమని గుర్తుంచుకో.

నువ్వెపుడూ నీ చుట్టూ ఒక బిరి గీసుకుని పెట్టేసుకుని ఇది సరైనదే అనుకుంటావు. ఆ బిరి లోపల ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటావు. కాని ఆ బిరి దాటి బయటకు వచ్చి ఆలోచించవు. అక్క అస్తమానూ నాదగ్గర అంటూ ఉంటుంది - 'మనం వాడిని ఏదో ఇంప్రూవ్ చేసెయ్యాలని అనుకుని వాడిని కన్ఫ్యూస్ చేసేస్తున్నామేమో' అని. నీవు నీ అంతట నువ్వు ఆలోచించాలి అంటే మేము నీకు ఏదీ చెప్పకూడదు. కానీ ఏమీ చెప్పకపోతే నీకు ఒక్కోసారి ఏమి చెయ్యాలనేది తోచదు. ఏదీ రిస్ట్రిక్ట్ చేసుకోకు. నేను ఇలానే ఉండాలి అనుకోకు. మరోలా ఉంటే కూడా ఎంత బాగుంటుందో ఆలోచించు. మనం ఏ ఎథిక్స్ ని మీరకుండా నడచుకుంటే తప్పేముంది చెప్పు.

నువ్వు ఏదో ఆలోచన, ఐడియా పెట్టేసుకుని ఇంటికి ఉత్తరం కూడా రాయడం మానేసావు. ఫోన్ చెయ్యడం మానేసావు. క్షేమ సమాచారాలతో ఉత్తరం రాయడానికేం? ఫోన్లో అయితే అన్ని డిటైల్స్ అడుగుతారు. కాని లెటర్లో అవేమీ అడగలేరుకదా! నీ క్షేమం అమ్మ నాన్న గార్కి తృప్తినిస్తుంది. ఆ తర్వాత గొడవ నీ క్షేమాన్ని మించి విలువైనదేమీ కాదు కదా!

బావా ఇవన్నీ నీకు తెలియవని కాదు. నీ ఆలోచనకి తట్టవు. (అలా అని నీది మట్టి బుర్ర అని నేను అనుకుంటున్నానని నీవనుకుంటుంటే అది నా తప్పు కాదని మనవి.) జీవితానికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, నిబంధనలు, నిబద్ధత ఇవన్నీ ముఖ్యమే, జీవితానికి మంచి అసిస్టెన్స్ ని ఇస్తాయి, కాని ఆ జీవితానికి ఊపిరి పోయలేవు. ఎంత సెంటిమెంటల్ గా ఉండాలో అంత ప్రాక్టికల్ గా కూడా ఉండాలి. ప్రేమ మధురంగా ఉండాలన్నా, జీవితం అందంగా ఉండాలన్నా డబ్బు ముఖ్యం. అందుకే నువ్వు మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇక్కడ నేను, మీ అమ్మ, నాన్నగారు అంతా క్షేమంగా ఉంటాము. మాకు నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు ? అన్నది ముఖ్యం కాదు. కేవలం నీ క్షేమ సమాచారాలు ముఖ్యం. ఉత్తరాలు రాయి. అలాగని ఎంతైతే ఎటాచ్మెంట్తో ఉంటావో, అంతే డిటాచ్మెంట్తో ఉండడం కూడా అలవాటు చేసుకో. అపుడే మనసు బాగుంటుంది. డీలాగా ఎపుడూ ఉండకూడదు. ఛీర్ వుల్గా ఉండాలి. ఇవన్నీ అక్కడ ఉన్న నీ స్నేహితులు చెబుతారని నాకు తెలుసు, కాని నేను చెబితే వింటావని నమ్మకం.

మా అక్క, అమ్మ అక్క పెళ్ళి హడావుడిలో బిజీగా ఉన్నారు, గుమాస్తాలకు చెప్పి పనులు చేయిస్తున్నారు. ఇపుడు సీజన్ కదా నాన్నగారు పొద్దుట ఆఫీస్ కి వెళ్ళి రాత్రి ఎప్పటికో వస్తున్నారు. నా గురించి నీకు తెలుసు కదా పొద్దుట ప్రోజెక్ట్ తో బిజీ, రాత్రి సమయాల్లో ఎగ్జామ్స్ ప్రిపరేషన్. నువ్వు మాకు బావవే కాదు, అక్కకు క్లాస్మేట్ వి కూడ, సొ తన పెళ్ళికి నువ్వు రాక పోతే నిన్ను క్షమించదు.

ఏయ్ బావా! మరి నువ్వొచ్చినప్పుడు నాకేం తెస్తావు? ఏ కానుకలు తెచ్చినా నాకిష్టముండదు. మనసు నిండా ప్రేమ నింపుకుని కోటి ముద్దులు కొనుక్కుని నాకోసం తీసుకుని రావాలి.


నా ఈ ఉత్తరం నీకు పొజిటివ్ గా పని చేయాలని, నీకు మంచి ఇన్స్పిరేషన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను బావ. కష్టపడితే అద్భుతాలు చేయ్యొచ్చు బావ. ఈ మరదలి ప్రపంచంలో నువ్వూ ఒకడివి కాదు బావా, నా ప్రపంచమే నువ్వు. నా ప్రపంచం అంతా నువ్వు. ముద్దు రుచెరిగినప్పటినుండీ ముద్ద రుచి నచ్చడం లేదు బావ. నాకు మళ్ళీ ముద్దెపుడిస్తావు?

అవును బావా! ప్రియురాలి సమక్షంలో కంటే ఆమె లేని విరహంలో ఆలోచనలు చాలా బాగుంటాయట కదా నిజమేనా? మనిద్దరం ఇప్పటి వరకూ ఒకే ఊర్లో ఉండడం వల్ల నీకు ఉత్తరమే రాయలేదు. బావా! నాకు తోచింది రాసాను. ఈ ఉత్తరం నీకు నచ్చిందా? అవును బావా! నీకు ఈ లక్ష్మి అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటానా? కొంచమా? ఏయ్ నా జీవితపు రియల్ హీరో - ఇక సెలవు తీసుకుంటాను. మళ్ళీ లెటర్లలో కలుద్దాము. హ్యాపీగా ఉండు బావా. జీవితమే ఒక బరువు, హ్యాపీ గా లేకపోతే మరింత బరువుగా ఉంటుంది. మా అందరికీ నీ క్షేమసమాచారాలు ముఖ్యం. లెటర్స్ రాయడం మరచిపోకు. హ్యాపీనా?

ముద్దులతో,

నీ... 


6 comments:

Rajendra Devarapalli said...

ప్రసాద్ గారూ,ప్రేమలేఖ బాగుంది గానీ,ప్రేమ,విరహం అనే రెండు సున్నిత భావాల జలతారులో వేదాంత,మనోవిజ్ఞాన శాస్త్రాన్ని,మానసిక విశ్లేషణ డబ్బా వొలికింది. బావకు మరదలు రాయబోయి వాళ్ళ కాలేజీ మహిళా ప్రిన్సిపాల్ రాసినట్లుంది.మీకొక విషయం చెప్పమంటారా, ఆడవాళ్ళు రాసినట్లు మనం రాయలేము.మీతో పాటే ఆత్రేయనూ కలుపుతున్నాను.మనం రాస్తే అది కవిత్వం అవుతుంది. ఈసారి బావ చేత రాయించండి.ఇంతకీ ఏంజలీనా జోలీ అక్కడ ఏంచేస్తొంది?

Unknown said...

eee premalekha chala bagundi

కార్తీక్ పవన్‌ గాదె said...

చాలా బాగా రాశారండీ.. కానీ నలుపు బ్యాక్ గ్రౌండ్ మీద తెలుపు అక్షరాలు చదవడానికి కళ్ళు కాస్త కష్టపడ్డాయి.. కుదిరితే ఆ రంగుల్ని మారుద్దురూ...! ప్లీజ్

కార్తీక్ పవన్

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

RANGA RAVURI said...

Telugu lo blog chestune, chala angla padala anukokunda dorlutune unnai anukuntunnanu, konchem aa angla padala motadu tagginchukunte, marinta andanni addinavaravutaru meeru.

Hima bindu said...

బాగుంది :)