16 Dec 2010

ప్రేమంటే...

ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -
"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.

మన ప్రాణాలన్నీ...

నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నీ పంచ ప్రాణాలూ  నా ఒక్క ప్రాణమని అంటున్నానేకాని 
నీ ఒక్క ప్రాణం కోసం నా పంచ ప్రాణాలు పణంగా పెట్టనా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...

15 Dec 2010

ఇవ్వడమే కదా ప్రేమ

బంధం ఆకర్షణతో మొదలైనపుడు
ఆకర్షణ ఆశించడాన్ని నేర్పింది
ఆకర్షణ ప్రేమగా మారినపుడు
ప్రేమ ఇవ్వడాన్ని నేర్పింది.
ఎంతగా అంటే ఎంత ఇచ్చినా
ఇంకా ఏదో లోటు చేస్తున్నాననే...

మన మనసుకున్న మనుషులు

ప్రతి మనసుకి కన్నీరు ఉంటుంది
ఆనందంతో, దుఃఖంతో.
అవి మనసులో ప్రవేశించే మరో ప్రతి మనసుకి
ఒక అర్హత పత్రాన్నిస్తాయి!

ఏ ఒక్క మనిషి వలన మనకు
ఈ రెండు కన్నీళ్లు ఉంటాయో
వాళ్ళే మన మనుషులు,
మన మనసుకున్న మనుషులు.

4 Dec 2010

నిర్దయ

ఆయుష్షుందని,
శరీరం శిధిలమైనా ప్రాణాన్ని బంధించి ఉంచే
ఆ దేవుని నిర్దయలాంటిదే
ప్రేమ చచ్చిపోయిన హృదయమున్న మనిషిని
జీవింపచేయడం కూడా!

నీ జ్ఞాపకాల సవ్వడి

కదలక కదలాలనిపించక
వలదని అన్నా,
వదలక మనసున చొరబడి,
ఏదో సడి... యదలో అలజడి...

ప్రియురాలిని పారేసుకుంటే...

నాకిష్టమైన ఆణిముత్యాన్ని
అదృష్టం లేక పోగొట్టుకున్నాను
మీకు దొరికిందా, మీకు దొరికిందాని
నోరు తెరిచి, చేతులు చాచి అడగలేక
దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నాను
అది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరి
ఆనందాలను పంచుతూ ఉంటుంది,
ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది?
పారేసుకున్న చోటు తెలుసు,
తెలిసినా వెదకలేను,
వెదికినా వేడుకలను చూడలేను...
తిరిగి నా ముత్యాన్ని ముత్యపు చిప్పలో
ఉంచి తెచ్చిఇచ్చినా,
అది నా ఆణిముత్యమవుతుందా?
ప్రేమ...
ఒకచోట కొందర్ని ఆనందసాగారాలలో తెలుస్తోంది అంటే,
ఎక్కడో ఒకచోట మరి ఇంకవరినో దు:ఖసముద్రంలో ముంచిందన్నమాటే!
కనీసం కొందరి విషయంలో...

3 Dec 2010

నర్తించే కన్నీరు

ప్రియా!


నీపై ప్రేమను హృదిలో,
నీ తాలూకు ఆలోచనలను మదిలో
అదిమిపెట్టి ఉంచడాన్ని
అధిగమించలేకపోతున్నాను.
మన జ్ఞాపకాల శిధిలాల మధ్య
మనసు రాసే గాయాల గేయాలకు
కన్నీరు నిరంతరం నర్తిస్తూనే ఉంటోంది...