నాకిష్టమైన ఆణిముత్యాన్ని అదృష్టం లేక పోగొట్టుకున్నాను మీకు దొరికిందా, మీకు దొరికిందాని నోరు తెరిచి, చేతులు చాచి అడగలేక దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నాను అది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరి ఆనందాలను పంచుతూ ఉంటుంది, ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది? పారేసుకున్న చోటు తెలుసు, తెలిసినా వెదకలేను, వెదికినా వేడుకలను చూడలేను... తిరిగి నా ముత్యాన్ని ముత్యపు చిప్పలో ఉంచి తెచ్చిఇచ్చినా, అది నా ఆణిముత్యమవుతుందా? ప్రేమ... ఒకచోట కొందర్ని ఆనందసాగారాలలో తెలుస్తోంది అంటే, ఎక్కడో ఒకచోట మరి ఇంకవరినో దు:ఖసముద్రంలో ముంచిందన్నమాటే! కనీసం కొందరి విషయంలో...
నీపై ప్రేమను హృదిలో, నీ తాలూకు ఆలోచనలను మదిలో అదిమిపెట్టి ఉంచడాన్ని అధిగమించలేకపోతున్నాను. మన జ్ఞాపకాల శిధిలాల మధ్య మనసు రాసే గాయాల గేయాలకు కన్నీరు నిరంతరం నర్తిస్తూనే ఉంటోంది...
నేననుభవిస్తున్న శిక్షో, విధి నా మీద సాధిస్తున్న కక్షో, లేక నేనేదుర్కుంటున్న పరీక్షో తెలియదు కాని జాగు లేని జాములో విశ్రమించడానికి శ్రమించడం... అసలు జరిగేదొకటే నేస్తమా... నిట్టూరుస్తూ వాలిపోయే నాలో మన జ్ఞాపకాలు వరసగా రీళ్లై కనుమూసిన రెప్పల తెరలపై ప్రదర్శించబడే చలన చిత్రాలౌతాయి ఈలోగా దూరంగా ఎక్కడో ఒక కుక్క అరుపు వినబడుతుంది ఈలోగా ఒక గాలి తిమ్మెర చల్లగా ఓదార్చి పోతుంది ఆఖరికి మాగన్నుగా ఒక కునుకు పట్టేవేళ కోడి కొక్కొరొకో అంటుంది. సత్యం, ఇది నిత్యం.
నీ రూపం ఒక అపురూపమై మన మధ్య ఆగిపోయిన కాలంతో పాటు ఒక అందమై, అద్భుతమై నా మదిలో నిలిచిపోయింది. నిలిచిపోతుంది... ఎన్నటికీ మారనట్టు, ముడతలు పడనట్టు... అదృష్టమే కదా మరి!