10 Nov 2007

కౌగిలి ముద్దలు

విరహ వేదనలో నా ఆకలి నీకు దయను కలిగిస్తే
మల్లిపూవుల పక్క ఒకటి అరటియాకుగా నువ్వువేసి
తీపిముద్దులను నంజుకోసం
వేడి కోరికల అన్నం పెట్టి
తపన కౌగిళ్ళను ముద్దలుగా
వలపు పరువంతో తినిపించి - గెలుపు గుర్రాన్ని తలపించి
ఆకలంతటిని పంపేసి - నా యద వాకిటను నిదిరించే

నన్ను నిమిరిన నీ చేయి - ప్రేమను మించిన పైచేయి.

అభిషిక్తం

ఆ ఆకాశంలో వెన్నెల వెలిగిస్తే వెలిగే దీపం కాదు
ఈ హృదయంలో ప్రేయసి చెరిపేస్తే చెరిగే రూపమూ కాదు -
నువ్వు, నేను, మన మధ్య ఈ ప్రేమ
ఇవన్నీ తొలగిపోయేది
చెరిగిపోయేది
మట్టితో మనమభిషిక్తులమయ్యాకనే
అంత వరకూ ప్రేయసీ!
నువ్వెవరైవైనా
నువ్వెక్కడున్నా
ఈ రెండు హృదయాలూ
ఒకానొక శూన్యంలో
ప్రేమ అనే వారధితో బంధింపబడి
వేదనతో కూడిన తృప్తిని
మైమరచిపోయి అనుభవిస్తూనే ఉంటాయి.

పదిలం

ప్రియా!

ప్రపంచంలో నేను చూసిన అందం
నీతోపాటూ కనుమరుగైపోయింది

అనుభవంలో నేను పొందిన ఆనందం మాత్రం
నీతోపాటూ నా హృదయంలో పదిలమై పోయింది.

నీ రూపం - ఒక ధ్యానం

నే కనుల మూయిటే ఒక పాపం
వచ్చి నిలుచునే నీరూపం

నా మనసులోనికి ఒక పయనం
నీ చెంత నిలుచుటే ఒక ధ్యానం.

పోయిన ప్రాణాలు...

ప్రభూ!

నేను మరణించిపోతాను అని నాకు ముందే తెలిస్తే
నేను ఫక్కున నవ్విపోతాను - ఎందుకంటే -
నేను ఒక దేవత ప్రేమకు దూరమైన రోజున
మరణించిపోయాక కూడా
కొత్తగా మీరొచ్చి తీసుకుపోయే ఈ ప్రాణాన్ని చూసి
నేను ఫక్కున నవ్వుతాను.

నీ జ్ఞాపకంతో...

ప్రియా!
నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే
జరిగేదే ఒక అద్భుతసృష్టి
దానికి విధి కథ రాసే బ్రహ్మను నేనే
ఆ ఊహే మధురంగా ఉంటుంది,
పిచ్చిగానూ ఉంటుంది
కాని అంత పెద్ద బ్రహ్మ కూడాను
ఒక చిన్న కన్నీటిచుక్కకే కొట్టుకుపోతాడు.

నా నీడగా నువ్వు...

నీడలో మనిషి లేడనేది నిజం
మనిషి లేకుండా నీడ లేదనేది కూడా నిజం
కాని ప్రియా!
మనిషిగా నేను, నా నీడగా నిన్ను భావిస్తే
ప్రేమ ఉన్న వెన్నెల వెలుగులో
నేనున్న ప్రతీచోట నీవు నీడగా ఉన్నట్లే
కాని ఆ నీడలోనే నీవు లేవు.

ఈ అక్షరాలు...

ప్రియా!

నీ జ్ఞాపకంలో నేను రాసిన ఈ అక్షరాలు -
పొందికగా అమరిన కవితలు,
వెన్నెల జలపాతంలో పన్నీటి కెరటాలు,
మరపురాని సంధ్యలో ఆహ్లాదమైన కిరణాలు,
నునువెచ్చటి వేకువలో మనసైన నేస్తాలు,
భారాన్ని తగ్గించి భావాన్ని తీసుకొచ్చే విలువైన రాయభారులు,
భావం సరిగా పలకకపోతే చిన్నబుచ్చుకునే చిన్నారులు,
సిగ్గుపడే నిన్ను నా చెంతకు అనునయంగా చేర్చే పరిచారికలు,
నవ్వుల వెన్నెల బొమ్మగా నిను చూపే చలనచిత్రాలు,
స్వయంవరంలో వీరుని గెలుపుకై ఆరాటపడే రాకుమార్తెలు,
ఎవరూ కానరాని చోట భువికేతించి నాట్యమాడె అప్సరసలు,
ఆఖరిగా ...
నా ఊహాలోకంలో
నిన్ను నాచెంతకు చేర్చి
మహగొప్ప ఆశీస్సులనిచ్చే ఆత్మబంధువులు.

సొగసిరి-గడసరి

వల్లమాలిన సిగ్గులొలికే మేలిమే నన్ను చేరిన సొగసిరి
నన్నుచేరి వలపు పిలుపుల ఆటలాడె గడసరి
మత్తుచూపుల తేనె జల్లుకు నా మనసు పని ఇక సరిసరి
కైపు ఊపుల సయ్యాట వేడిలో నిదుర రాదా ఈ రాతిరి?

గెలుపు రాని ఓటమి

ప్రపంచంలో మరే విషయంలో అయినా కాని
ఓటమి తర్వాత గెలుపు రావచ్చు
కాని ప్రియా!
నిన్ను నిన్నుగా నేను కోల్పోయాక కూడా
ఓటమి తరువాత మరెన్నటికీ గెలుపు రాదు,
అయినా అది ముగింపు అనడానికి మనసూ రాదు...

6 Nov 2007

యవ్వనం

...యవ్వనం ఒక వరం
అందునా తిరిగి పూయని ఒక వనం.

4 Nov 2007

నీరూపం - నీ శాంతం

అలలు అలలుగా నీ రూపం - నా యదల లోయలో కదలాడె
వెన్నెల కెరటమై నీ శాంతం - నను నిప్పు కిరణమై రగిలించె

విఫలయత్నం

నీ మనసున ఉప్పొంగి పొంగే
నీ ప్రియురాలి జ్ఞాపకాలు ,
అవి సృష్టించే హృదయాగ్ని కీలలు
నిన్నే దహించి వేస్తున్నపుడు
ఆత్రంగా వాటినార్పడాన్కి
నిష్ప్రయోజనమైన ప్రయత్నం నేను చేస్తాను, విఫలమై
నిస్సహాయంగా కన్నీటిచుక్కనై వెలుపలికి వస్తాను -
ఆనక దీనంగా ఆవిరౌతాను.

కన్నీటి బొట్టు

తిష్ఠవేసిన ప్రియురాలి
జ్ఞాపకాలు మదిలోన

చోటులేదే లోలోన
తన్నుకొస్తిని దీనంగా...

ఆత్మ లేని ప్రార్ధన

ఓ ప్రభూ

నిన్ను చేరడానికి

నాకుకొన్ని పూలంటూ ఉండాలి - నిన్ను అర్చించడానికి,
కొన్ని పాలంటూ ఉండాలి - నిన్ను అభిషేకించడానికి,
కొన్ని పళ్ళంటూ ఉండాలి - నీకు నివేదించడానికి...

కాని ప్రభూ

వీటన్నిటికీ మించి నాకొక మనసంటూ ఉండాలి -
అది నేను తిరిగి పొందడానికి మరొ జన్మంటూ ఉండాలి.

హృదయబాధ

ప్రియా!

నీకెటుల  తెలుపగలనే మన ప్రేమ గాధను మోసే నా హృదయబాధను

మరవగలనే ప్రియా

పచ్చి పచ్చిగ పరవళ్ళాగని పడవేసే మాటలు
గుచ్చిగుచ్చి చూడగ గుబులెక్కించే చూపులు
వచ్చివచ్చి చేరగా మత్తెక్కించే చేతలు
నచ్చినచ్చి గెలిచిన మైమరపించే స్పర్శలు

మరవగలనే ప్రియా నే మరవగలనే

కన్నీటిచుక్క

ప్రియా!


నీవొచ్చి ముద్దిచ్చినపుడు ప్రపంచమే రెక్క విదిల్చింది
నీవు నన్ను విదిల్చికొట్టినపుడు మనసొక కన్నీటిచుక్క రాల్చింది.

పరధ్యానం

... నీవు లేని నాకేది ధ్యానం
మిగిలింది నాకిక పరధ్యానం ...

కాలం

ప్రియా!

చూడు 

నీవున్నపుడు దానిని గుర్తించలేదని కోపంతో పరుగులెట్టి
నీవులేనపుడు వెక్కిరిస్తో నెమ్మదిగా అడుగులో అడుగులేస్తోందీ కాలం

3 Nov 2007

ప్రేమ

స్నేహమనే బావిలో 'పంచుకోవడమనే' బాల్చీ వేసి తోడుకుని తెచ్చుకున్నప్పుడు పుట్టిన అమృత జలమే ప్రేమ.

నీవే నామనసు

కేవలం నేనే ఈ జన్మకు తనువు
ప్రియతమా! ప్రతి జన్మకు నీవే నామనసు.

ప్రేమంటే...

లేచున్నపుడు ఇలలో
నిదురున్నపుడు కలలో
నన్నే మరచి
నిన్నే వలచి
నువ్వే కావాలని
నిన్నే గెలవాలని -
నిరంతర యానంలా సాగే తపన
దేవుని ముంగిట నిలచే ప్రార్ధన... ప్రేమంటే!

కన్నీటి చుక్క

నీప్రేమ కధకొక సాక్షాన్నై
నీమౌన వ్యధకొక భాష్యాన్నై
నీ మనసును తెలిసిన నేస్తంగా
నిను వీడి నేను పోకున్నా
వీడకపోతే నేలేకున్నా...

యుగాలై నడుస్తున్న కాలంలో

నీ చిర్నవ్వు గుర్తు
ఒక కన్నీటి బొట్టు
కలగలసి పోతే
నాకొక రోజు గడిచినట్టు,
ఒక యుగం దొర్లినట్టూను.

ప్రియా నువ్వెక్కడ ఉన్నావు?

ఒక వేకువ జాము మొదటలో నీవు గుర్తొస్తే
ఆనాటి వెలుగంతా నాకు చీకటే

ఒక సందె పొద్దు చివరలో నీవు గుర్తొస్తే
ఆనాటి రాత్రంతా నిదుర కరువే!

ప్రార్ధన-ప్రారబ్దం

ప్రియా!
ఒక ప్రార్ధన నుండి జనించని ఒక వరం
ఒక ప్రారబ్దం నుండి మరణించని ఒక శాపం
కలసి ఇపుడు మన మద్య సృష్టించినదే ఈ దూరం.

మనసుకు ఎవరూ లేరు

ప్రియా నీవెళ్ళిపోయాక కూడా
నాకు చాలామంది ఉన్నారు
కాని...
నామనసుకే ఎవరూ లేరు..  పాపం... 

మనలోని...

మనలోని వెచ్చదనం
మనలోని స్వచ్చదనం
తిరిగి ఏపుణ్యాలు చేస్తే
తిరిగొస్తాయి ప్రియతమా?